తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. ఈ నెల 16వ తేదీన జపాన్ పర్యటనకు బయల్దేరిన సీఎం బృందం అక్కడ పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు జరిపారు.
పెద్ద మొత్తంలో రాష్ట్రానికి పెట్టుబడులు
ఈ పర్యటనలో తెలంగాణకు మేలు కలిగించేలా పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించారు. మొత్తంగా రూ. 12,062 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు సుమారు 35,000 ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెట్టుబడులన్నీ రాష్ట్రానికి గణనీయమైన ఆర్థిక వృద్ధిని తీసుకొస్తాయని ఆశలు వ్యక్తం చేశాయి.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ‘నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్’ ఏర్పాటు
ప్రత్యేకంగా జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ‘నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్’ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఈ పార్క్ ఏర్పాటుకై ఒప్పందం జరిగింది. అదేవిధంగా ఎన్టీటీ డేటా, నెయిసా వంటి టెక్నాలజీ సంస్థలతో కలసి హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్ల విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కూడా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణను టెక్‌హబ్‌గా మార్చే దిశగా మరింత ముందడుగు పడినట్లు ప్రభుత్వం పేర్కొంది.