రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసిన లేదా వివిధ కారణాలతో పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం 261 ద్విచక్ర వాహనాలను బహిరంగ వేలం ద్వారా అమ్మే ప్రకటన రాచకొండ సిటీ పోలీస్ కమిషనరేట్ నుండి విడుదలైంది. సెకండ్ హ్యాండ్ బైకులు తక్కువ ధరకే కొనాలనుకునే వారికి ఇది ఒక పెద్ద అవకాశంగా నిలుస్తోంది.

వివరాలు:
రాచకొండ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రోడ్లపై వదిలి పెట్టిన లేదా ఇతర కారణాల వల్ల స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను రాచకొండ సిటీ ఆర్మ్డ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్ అంబర్ పేట్‌లో సేకరించి ఉంచారు. వాటిని బహిరంగ వేలం వేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొత్తం 261 ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ బైకులుగా బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ వాహనాలు ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో బహిరంగ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ వేలం సెక్షన్ 39బీ సిటీ పోలీస్ యాక్ట్, ఆర్/డబ్ల్యూ యాక్ట్ 7 ఆఫ్ సైబరాబాద్/రాచకొండ మరియు సెక్షన్ 40 & 41 ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348-ఎఫ్ ప్రకారం జరుగుతుంది.
వేలం ముఖ్యాంశాలు:
వేలం రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వాహనములకు సంబంధించిన పూర్తీ వివరాలు వెబ్‌సైట్ www.rachakondapolice.telangana.gov.in లో పొందు పరిచినట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్ నందు పొందుపరచిన వాహన యజమమానులెవారైన ఉంటే ఆ వాహనమునకు సంబంధించిన తగిన ఆధారాలు తీసుకోని ఈ ప్రకటన వెలువడిన 6 నెలల కాలవ్యవధి లోపల అంబర్ పేట డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 8008338535, 8712662661 ఫోన్ నంబర్లకు సంప్రదించాలన్నారు. ప్రకటన వెలువడిన నేటి నుంచి 6 నెలల కాల వ్యవదిలో వాహన యజమానులు సంప్రదించకపోతే ఆయా వాహనాలను రాచకొండ పోలీస్ వారి ఆధ్వర్యంలో వేలం వేస్తామని రాచకొండ సీపీ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.
కాగా, సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే అది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే బహిరంగ వేలంలో తక్కువ ధరకే బైకులు దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. పోలీసులు దగ్గురుండి వేలం వేస్తున్నారు కాబట్టి ఆయా బైకుల కొనుగోలులో ఎలాంటి పేపర్ వర్క్ ఇబ్బందులు ఉండవు. కాబట్టి సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకునేవారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.
Read also: TG POLYCET Results: తెలంగాణ పాలిసెట్ రిజల్ట్స్ విడుదల