తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ స్కాంలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదాస్పద కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టి. ప్రభాకర్ రావు త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎదుట హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన ఈ నెల 5న సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది.

14 నెలల అమెరికా గడువు – ఇప్పుడు తిరుగు ప్రయాణం
టి. ప్రభాకర్ రావు గత 14 నెలలుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకర్‌రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత్‌కు తిరిగి రానున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని సర్వోన్నత న్యాయస్థానానికి ఆయన ఒక హామీపత్రం కూడా సమర్పించినట్లు సమాచారం. వన్ టైమ్ ఎంట్రీ పాస్‌పోర్టు జారీ అయిన వెంటనే ఆయన భారత్‌కు బయలుదేరనున్నారు. పాస్‌పోర్టు అందిన మూడు రోజుల్లోగా దేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సిట్ విచారణకు హాజరవుతున్నట్లు దర్యాప్తు బృందానికి తెలియజేశారని తెలుస్తోంది.
విచారణకు కీలక మలుపు
ప్రభాకర్ రావు విచారణకు హాజరవడమే కాకుండా, ఈ కేసులో నిజాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. తద్వారా కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని సిట్ అధికారులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన విచారణ ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుందని భావిస్తున్నారు. ఆయన సర్వీసులో ఉన్న సమయంలో పలు కీలక రాజకీయ నాయకుల, ప్రభుత్వ ఉద్యోగుల, వ్యాపారవేత్తల ఫోన్లు అనుమతిలేకుండా ట్యాప్ చేయడంలో పాల్గొన్నారని ఆరోపణలున్నాయి.
Read also: Rajiv Yuva Vikasam: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2న రాజీవ్ యువ వికాసం ప్రారంభం