అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. తాజాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

అధికారాన్ని కూల్చాలని బీఆర్ఎస్ ఆశ?
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, “తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే అధికార దాహంతో తమను పడగొట్టాలన్న మాటలు చేయడం బాధాకరం,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకే వచ్చాయని ఆరోపించారు.
గచ్చిబౌలి భూముల వ్యవహారం
పొంగులేటి వ్యాఖ్యల ప్రకారం, ఇటీవల కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల విలువైన భూమిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం వల్లే బీఆర్ఎస్ నేతల్లో అసహనం తలెత్తిందని పేర్కొన్నారు. ఈ భూములు ఎవరి దాకా వెళ్లాయో, ఎవరికి లాభం జరిగిందో అన్న విషయాలు ప్రజలకు తెలుసని, అందుకే ప్రతిపక్ష నేతలు తట్టుకోలేక ప్రభుత్వంపై దూషణలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. అర్హులైన అందరికీ సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే జీవోను విడుదల చేశామని అన్నారు. భూభారతి వచ్చాక కొత్త ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. పొంగులేటి మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్ తండ్రీకొడుకులు ఇప్పటికీ సీఎం పీఠాన్ని వదులుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి, ప్రతీ చిన్న విషయాన్నీ రాజకీయం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రలు చేస్తుంటారు, అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read also: Bhoo Bharat :పోర్టల్ ప్రారంభం: ప్రతి భూమికి భూధార్