తెలంగాణలోని కాళేశ్వరం (Kaleshwaram Project)లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) సమర్పించిన నివేదికపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించి, సారాంశం సిద్ధం చేయడానికి శుక్రవారం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.నీటిపారుదల, న్యాయ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఆగస్టు 4న రాష్ట్ర మంత్రివర్గానికి తన నివేదికను సమర్పించనుంది. ఆ తరువాత క్యాబినెట్ సమావేశంలో నివేదికలోని సూచనలు, సిఫార్సులపై చర్చించనున్నారు.
నివేదిక ముఖ్యమంత్రికి అందజేత
సుమారు 700 పేజీల ఈ నివేదికను కమిషన్ గురువారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. శుక్రవారం ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సీఎం చర్చించారు.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల ప్రస్తావన
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలను నివేదిక ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా దోషులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా లేదా అన్నదానిపై క్యాబినెట్‌లో చర్చ జరగనుంది.
తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు?
ప్రాజెక్టులో లోపాలు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. నివేదికలోని అంశాలు, సిఫార్సులు వెలుగులోకి రాగానే తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
Read Also : Revanth Reddy : జర్నలిజం పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు