News Telugu: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఈ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షాల బారిన పడుతున్నాయి.

తెలంగాణలో భారీ వర్షాలు – రెడ్ అలెర్ట్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పరిస్థితి ఆందోళన కలిగించే స్థాయిలో ఉండటంతో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ (Red alert issued) చేశారు. ఇక హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి నెలకొని, కాలు బయట పెట్టలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో స్థానిక అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. గురువారం (ఆగస్ట్ 28) ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో రెండు రోజులు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వరుస సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరిస్థితులను బట్టి ఆయా జిల్లాల్లో విద్యాసంస్థల సెలవులపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో వాతావరణ ప్రభావం
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడుతూ, రాబోయే 24 గంటల్లో ఒడిశా వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీ జిల్లాల్లో వర్షాల అంచనా
గురువారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
విద్యాసంస్థలపై నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులను బట్టి పాఠశాలలు నిర్వహించాలా లేదా అనే అంశంపై జిల్లా కలెక్టర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో రహదారులపై అవసరం లేకుండా ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: