News Telugu: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి (Suravaram Sudhakar Reddy passes away)పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు వేరైనా సురవరం తనకు అత్యంత ఆత్మీయ మిత్రుడని, ఆయనను కోల్పోవడం వ్యక్తిగతంగా తీరని లోటని అన్నారు.
పుష్పాంజలి ఘటించి నివాళులు
దత్తాత్రేయ, సురవరం భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సురవరం రాజకీయ ప్రయాణం గుర్తు చేసుకున్న దత్తాత్రేయ
ఈ సందర్భంగా దత్తాత్రేయ (Dattatreya) మాట్లాడుతూ సురవరంతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న సురవరం, అనంతరం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి తుదిశ్వాస విడిచే వరకు పోరాటం సాగించారని కొనియాడారు. నల్గొండ ఎంపీగా పనిచేసిన రోజుల్లో ప్రజా సమస్యలపై పార్లమెంటులో ఆయన గళం వినిపించిన తీరు ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. సురవరం లోతైన పరిజ్ఞానం, నీతి, నిజాయితీ కలిగిన గొప్ప నాయకుడని దత్తాత్రేయ అభివర్ణించారు.
స్నేహపూర్వక అనుబంధం
దత్తాత్రేయ మాట్లాడుతూ – “ఆయన విమర్శలు ఎల్లప్పుడూ సున్నితంగా, హుందాగా ఉండేవి. ఎన్నో అంశాలపై నాతో చర్చించి, పరిష్కార మార్గాలు కూడా సూచించేవారు” అని అన్నారు. ప్రతి సంవత్సరం తాను ఆహ్వానించే ‘అలై బలై’ కార్యక్రమానికి సురవరం తప్పకుండా హాజరవుతారని, అలాంటి నిజమైన స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.
సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన
దత్తాత్రేయ, సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: