liquor sales : 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబర్ చివరి మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ. 1,000 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 500 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో డిసెంబర్ నెల మొత్తానికి మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 5,051 కోట్ల ఆదాయం లభించగా, ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రూ. 2,020 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మరోవైపు, ఏపీలో గడిచిన మూడు రోజుల్లో రూ. 543 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
నిమిషానికి తెలంగాణలో సగటున 95, ఆంధ్రప్రదేశ్‌లో 93 మద్యం సీసాలు (liquor sales) అమ్ముడైనట్లు అంచనా. న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, గుర్గావ్ వంటి ప్రధాన నగరాల్లో యువత మద్యం మత్తులో రోడ్లపై ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో హైదరాబాద్ ట్రై-కమిషనరేట్ పరిధిలో మొత్తం 2,731 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,198 కేసులు నమోదు కావడం గమనార్హం. పట్టుబడిన వారిలో 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల వినియోగంపై కూడా కఠిన నిఘా కొనసాగింది. ‘ఈగల్’ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో 89 మందికి పరీక్షలు చేయగా, నలుగురు డీజేలు సహా ఐదుగురికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పబ్బులు మరియు రిసార్టుల యాజమాన్యాలకు డ్రగ్స్ సరఫరాపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: