పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి – జీడిమెట్లలో హృదయవిదారక ఘటన
Hyderabad : శివారులోని జీడిమెట్లలో ఓ గృహిణి తన ఇద్దరు కుమారులను వేటకొడవలితో హత్య చేసి, ఆపై ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. బాలాజీ లేఅవుట్ ప్రాంతంలో ఈ దారుణం జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.ఖమ్మం జిల్లా సత్తుపల్లి నివాసితులైన వెంకటేశ్వర రెడ్డి, తేజశ్రీరెడ్డి (35) దంపతులు గత పన్నెండేళ్లుగా జీడిమెట్ల పారిశ్రామికవాడ సమీపంలోని బాలాజీ లేఅవుట్‌లో సహస్ర మహేశ్ హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి అక్కడి గ్రాన్యూల్స్ ఇండియా కెమికల్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబ పోషణ బాధ్యతలునిర్వర్తిస్తున్నాడు.గురువారం సాయంత్రం తేజశ్రీరెడ్డి మొదటగా తన పెద్ద కుమారుడు హర్షిత్ రెడ్డి (11)ను వేటకొడవలితో గొంతుకోసి హత్య చేసింది. అనంతరం తన చిన్న కుమారుడు ఆశీష్ రెడ్డి (8)ను కూడా అదే విధంగా హత్య చేసింది. పాపం చిన్నవాడు హత్యకు గురైన వెంటనే చనిపోలేదు. అయితే ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. అనంతరం తేజశ్రీ ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ఆరవ అంతస్థుపైకి వెళ్లి అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.పక్కా నివాసితులు ఈ ఘోరాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జీడిమెట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్, బాలానగర్ ఏసీపీ హనుమంతరావు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్న కుమారుడిని ఆసుపత్రికి తరలించినా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడే మృతిచెందాడు.ఇది ఆత్మహత్య మాత్రమే కాదు, బాధను మించిన బాధగా మారిన సంఘటన. తేజశ్రీ రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో భర్త వేధింపులతో పాటు, తన ఆరోగ్య సమస్యలు, పిల్లల ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు కారణంగా ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. జీవితంపై విరక్తి చెందానని, తనకు జీవించే ఆసక్తి లేకపోయిందని ఆమె పేర్కొంది

డీసీపీ సురేశ్ కుమార్ ప్రకారం, తేజశ్రీ మానసిక స్థితి కూడా గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉండేదని, ఆమెను వివిధ కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ విషాదకర సంఘటన మరోసారి మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు కలిసొచ్చినప్పుడు ఎలాంటి విషాదాలు జరగొచ్చో ఈ ఘటన స్పష్టంగా చూపుతోంది.
Read More :Rahul Gandhi : రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఖరారు