MGNREGA: అమలవుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్రకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర పంచాయ తీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క (Minister Sitakka) విమర్శించారు. పేదల పొట్టకొట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని.. కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహారించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మను, అమలు విధానాన్నీ మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు.
Read Also: Sarpanch Rights : సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR
ఉపాధి హామీ పథకంపై కేంద్ర విధానాలు పేదల వ్యతిరేకం
గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఉన్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానం పేదలను, రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉందని ఆక్షేపించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవిక మిషన్ (Vikasit Bharat – Guarantee for Employment and Livelihood Mission) విబి-జి ఆర్ఎంగా మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. ఆబిల్లును మంత్రి సీతక్క తీవ్రంగా తప్పుబట్టారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పించడం, వలసలను తగ్గించడం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని సాధించడం వంటి గొప్ప లక్ష్యాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చారిత్రక పథకాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి సీతక్క మండిపడ్డారు.

40 శాతం భారం రాష్ట్రాలపై మోపడం అన్యాయం
గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ఇలా చేయడంతో రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇది కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు. పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ(Mahatma Gandhi) పేరును తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలు, విలువల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మొదటి నుంచీ ఈ పథకం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలకు తెరలేపుతోందని మంత్రి విమర్శించారు.
గత ఏడాది రాష్ట్రంలో 12.5 కోట్ల పని దినాలు కల్పించగా, ఈ ఏడాది కేవలం 7.5 కోట్ల పని దినాలకే పరిమితం చేశారని వెల్లడించారు. రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన న్యాయమైన నిధుల వాటాను కేంద్ర ప్రభుత్వం సెస్లు, సర్చార్జీల పేరుతో కబళిస్తూ, ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇదే సమయంలో ఉపాధి హామీ పథకంలోనూ 40 శాతం భారం రాష్ట్రాలపై మోపడం పూర్తిగా అన్యాయమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులతో, బాధ్యతాయుతంగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని మంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: