హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన బిల్లులను ఇకపై ఆన్లైన్లో సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించిన చర్యలను పాఠశాల విద్య శాఖ ప్రారంభించింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులను సమర్పించడంలో ఆలస్యం అవుతున్నందున.. బిల్లుల చెల్లింపులోనూ ఆలస్యం అవుతోంది. దీంతో రాష్ట్రంలో ప్రతి ఏడాది మధ్యాహ్న భోజన బిల్లుల (Meal bills) కోసం ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని నివారించడానికి పాఠశాల విద్య ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు.

మధ్యాహ్న భోజన బిల్లులను ఆన్లైన్లో సమర్పించేలా చర్యలు
ఇకపై అక్టోబర్ నెల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులను ఆన్లైన్లో సమర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో బిల్లులను సమర్పించడం కోసం ముందుగా మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు (pilot project)గా ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగా భద్రాద్రికొత్తగూడెం, పెద్దపల్లి, నారాయణ్పేట్ జిల్లాల్లో బిల్లులను ఆన్లైన్లో సమర్పించడానికి ఐటి శాఖకి చెందిన సిబ్బందితో పాఠశాల విద్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఇకపై పాఠశాల స్థాయిలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులను ఆన్లైన్లో ఎలా సమర్పించాలి అనే అంశంపై ఐటి ఉద్యోగులుపాఠశాల శాఖ ఉద్యోగులకు వివరించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో మొదటి కాలమ్లో విద్యార్థుల అటెండెన్స్ ను తీసుకుంటారు. రెండో కాలమ్లో ఎజెన్సీ పేరు ఉంటుంది. మూడోకాలమ్లో మధ్యాహ్న కార్మికుల వివరాలు ఉంటాయి. ఇలా రూపొందించిన యాప్లో మొదటి కాలమ్ మాత్రమే ప్రతిరోజూ మార్చాల్సి ఉంటుంది. మిగిలిన రెండు కాలమ్స్ అలాగే ఉంటాయి కాబట్టి.. వాటి ద్వారా మధ్యాహ్న భోజనం బిల్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. 8వ తరగతి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పథకాన్ని అమలు చేస్తుండగా.. 9, 10 తరగతి విద్యార్థులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే నిధులను ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Read Also: