హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్ కార్యచరణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సందర్బంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది.

వచ్చే నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
అలాగే, ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణపై కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశముంది. ఇదే సమయంలో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని రంగంలోకి దింపాలన్న అంశంపై కూడా చర్చించనున్నారు. వచ్చే నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక, ఈ నెల 12వతేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
పార్టీ బలోపేతంపై నేతలకు సూచనలు
ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు కూడా హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ వస్తుంది. అయితే పాతవారిని రెన్యువల్ చేస్తారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే సమావేశంలో పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై కూడా చర్చించనున్నారు. పార్టీ బలోపేతంపై నేతలకు సూచనలు చేయనున్నారు.