జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ రంగంలో చివరి దశకు చేరుకుంటున్న వేళ, ప్రధాన పార్టీల ప్రచార కార్యక్రమాలు ఉత్కంఠను రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా పేరున్న పార్టీ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈసారి ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా, కేసీఆర్ ప్రచార రంగంలోకి దిగే అవకాశాలు కనిపించకపోవడం పార్టీ కార్యకర్తల్లో నిరాశను కలిగిస్తోంది. బీఆర్ఎస్ తరఫున ప్రచార బాధ్యతలు కేటీఆర్ భుజాలపై పూర్తిగా వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కేటీఆర్ భారీ ర్యాలీలు, డోర్ టూ డోర్ క్యాంపెయిన్‌లు, మైక్ ర్యాలీలతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపినా, కేసీఆర్ గైర్హాజరు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
అటు బీజేపీ వైపు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ పేర్లు ఉన్నప్పటికీ, వారిలో ఎవరూ ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొనలేదు. స్థానిక నేతలు, రాష్ట్ర స్థాయి నాయకులే ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. దీనివల్ల బీజేపీ ప్రచారంలో ఆకర్షణ తగ్గి, జాతీయ నాయకత్వం ఈ ఎన్నికపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న అభిప్రాయం బలపడుతోంది. జూబ్లీహిల్స్ వంటి ప్రతిష్టాత్మక పట్టణ నియోజకవర్గంలో జాతీయ నాయకుల గైర్హాజరు బీజేపీ వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇక కాంగ్రెస్ వైపు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ పరిధిలో పలు సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు కోసం బలమైన వేదికలు సృష్టిస్తున్నారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో, ఆ బంధం మైనారిటీ ఓటర్లలో ప్రభావం చూపనుంది. మొత్తం మీద, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ దూరం, బీజేపీ నాయకుల గైర్హాజరు, కాంగ్రెస్-మజ్లిస్ జంట కదలికలతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీకరణాలు కొత్త మలుపు తిరిగాయి. చివరి నిమిషంలో జరిగే కదలికలే ఈ కీలక నియోజకవర్గం ఫలితాన్ని నిర్ణయించనున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/