తెలంగాణకు యూరియా (Urea ) కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీతో కలిసి ఆయన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
తక్షణమే యూరియా సరఫరా చేయాలి
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తక్షణమే సరఫరా చేయాలని రఘురాం రెడ్డి (MP Ramasahayam Raghuram Reddy) డిమాండ్ చేశారు. పంటల సాగుకు ఇది అత్యంత కీలక సమయమని, ఈ సమయంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన అన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి రైతుల అవసరాలను తీర్చాలని ఆయన కోరారు.
రాజకీయ దురుద్దేశాలు ఆపాలి
యూరియా కేటాయింపులో కేంద్రం రాజకీయ దురుద్దేశాలను మానుకోవాలని రఘురాం రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. కేవలం రాజకీయాల కోసం రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఆపడం సరికాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ఈ విషయంలో రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.