తెలంగాణ శాసనసభలో మైకుల కట్టింగ్ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బీజేపీ శాసనసభాపక్ష నేత (BJLP) ఏలేటి మహేశ్వర్ రెడ్డి సభలో తమ గొంతును నొక్కేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము ప్రజా సమస్యలపై మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ప్యానెల్ స్పీకర్ పదేపదే మైకులు కట్ చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ఆయన ఆరోపించారు. సభలో ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా చేయడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు.
HYD: మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు.. పార్టీకి గట్టి షాక్
ఇదే క్రమంలో మహేశ్వర్ రెడ్డి ఎంఐఎం (MIM) ఎమ్మెల్యేలను ఉద్దేశించి సెటైర్లు వేశారు. “పక్కన షేర్వానీలు వేసుకున్న వాళ్లు గంటల తరబడి మాట్లాడినా మైకులు కట్ చేయడం లేదు కానీ, మేము మాట్లాడితే మాత్రం నిమిషాల్లోనే కట్ చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. ఈ వివక్షను నిరసిస్తూ, వచ్చేసారి తాము కూడా సభకు షేర్వానీలు వేసుకొస్తామని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించడం సభలో చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు సభలో కొంత నవ్వులు పూయించినప్పటికీ, సభా నిర్వహణలో పారదర్శకత లేదనే విషయాన్ని ఆయన గట్టిగా వినిపించారు.

అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ మరియు ఎంఐఎం మధ్య ఉన్న అనుబంధంపై కూడా మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ అంటేనే ముస్లింలు.. ముస్లింలంటేనే కాంగ్రెస్” అని గతంలో ముఖ్యమంత్రే స్వయంగా అన్నారని ఆయన గుర్తు చేశారు. అందుకే సభలో ఎంఐఎం సభ్యులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, బీజేపీ సభ్యుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. మతపరమైన రాజకీయాలతో అభివృద్ధిని పక్కన పెడుతున్నారని, సభలో అందరికీ సమాన అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com