Ibrahimpatnam Municipal Chairman Election: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే హస్తం పార్టీ రాజకీయంగా డీలా పడిపోయింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ముందే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది.
Read also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?
అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ క్యాంపు ఖాళీ..?
గెలిచిన ఎనిమిది మంది కౌన్సిలర్లను కాపాడుకునేందుకు కందుకూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో కాంగ్రెస్ పార్టీ క్యాంపు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే, అక్కడ అంతా సవ్యంగా సాగలేదని తెలుస్తోంది. చైర్మన్ పదవిపై కన్నేసిన ఇద్దరు నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. “గత ఎన్నికల్లో ఎమ్మెల్యే నా దగ్గర డబ్బులు తీసుకున్నారు.. కాబట్టి పదవి నాకే దక్కుతుంది” అంటూ ఒక నేత వాదించగా, దానికి ప్రతిగా మరో నేత తీవ్రంగా స్పందించారని, దీంతో రిసార్ట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, సఖ్యత కుదరకపోవడంతో పార్టీ నేతలు చేసేదేమీ లేక రాత్రికి రాత్రే క్యాంపును ఎత్తేసినట్లు సమాచారం.
Ibrahimpatnam Municipal Chairman Election: బీఆర్ఎస్ ‘చతురత’.. 16కు చేరిన బలం
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుంది. 13 మంది సొంత సభ్యుల బలం ఉన్నప్పటికీ, రాజకీయ చతురతతో స్వతంత్ర అభ్యర్థిని ఇప్పటికే తమ గూటికి చేర్చుకోగా.. బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను కూడా బిఆర్ఎస్ కే మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ బలం 16కు చేరుకోగా, కాంగ్రెస్‌కు చెందిన మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా గులాబీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు మున్సిపాలిటీ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్‌కు చుక్కెదురు.. మ్యాజిక్ ఫిగర్‌కు దూరం
మరోవైపు ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలోనూ కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. భువనగిరి ఎంపీ తన ఓటు హక్కును జనగామకు మార్చుకోవడం, కేవలం స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఓటు మాత్రమే అందుబాటులో ఉండటంతో కాంగ్రెస్ బలం 9కి మించడం లేదు. మ్యాజిక్ ఫిగర్‌కు ఆమడ దూరంలో ఉండటం, సొంత కౌన్సిలర్ల మధ్యే ఘర్షణలు చోటుచేసుకోవడంతో.. పోటీ నుంచి తప్పుకుని పరువు కాపాడుకోవడమే మేలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం దాదాపు ఖాయమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: