తెలంగాణకు జీవధారగా నిలిచే కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project ) వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పష్టత ఇచ్చారు. కమిషన్ ముందు అన్ని ఆధారాలు సమర్పించామని, నోటి మాటలు కాదు, సాక్ష్యాలతోనే వాదనలన్నీ సమర్పించామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్‌ను మార్చిన విషయంలో ప్రభుత్వంగా తీసుకున్న సాంకేతిక నిర్ణయాలపై పూర్తి వివరాలతో కమిషన్ విచారణలో సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. గతంలో మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టుకు అంగీకరించకపోవడం, వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాల్లో ముంపు సమస్యలు ఉండడంతో తమ్మిడిహట్టిని వదిలి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం తలెత్తిందని వివరించారు.
కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుకు అనుమతులు
హరీశ్ రావు దృష్టిని కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా సాధించలేకపోయిన పరిస్థితులవైపు మళ్లించారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టుకు కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఉన్నా ఏ ఒప్పందం, అనుమతులు సాధించలేకపోయారని విమర్శించారు. దీనికి బదులుగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వాప్కోస్ వంటి కేంద్ర సంస్థల సిఫారసుల మేరకు మేడిగడ్డ వద్ద నీటి లభ్యతపై ఆధారపడి ప్రాజెక్టును నిర్మించిందన్నారు. అలాగే కాళేశ్వరం కార్పొరేషన్‌కు కూడా అన్ని అధికారిక అనుమతులున్నాయని స్పష్టత ఇచ్చారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం లో భాగమే
ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న భాగాలు అన్నీ యథాతథంగా ఉన్నాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 21 పంప్ హౌస్‌లు, 240 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం వంటి అంశాలను వివరించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం భాగమేనని, హైదరాబాద్‌కు తాగునీరు, ముసీ నదీ శుద్ధికై ఆ నీటిని వాడతామని తెలిపారు. ఒకవైపు ఈ ప్రాజెక్టుపై ఆధారపడి నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ మరోవైపు కాళేశ్వరం కూలిపోయిందని ఆరోపించడాన్ని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
Read Also : Malaysia: మలేషియా రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి