హైదరాబాద్ ప్రజలకు హైడ్రా శుభవార్త అందించింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే పతంగుల పండుగ కోసం నగరంలోని అభివృద్ధి చేసిన చెరువులను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువుల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు.
TG Assembly : 29 నుంచి శీతాకాల సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధం

హైడ్రా కమిషనర్ మాధాపూర్‌లోని తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువుల్లోకి నేరుగా మురుగు నీరు చేరకుండా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే ప్రవేశపెట్టేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎస్టీపీలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు చెరువుల సమీపంలోని ప్రభుత్వ భూమిని వినియోగించుకోవాలని సూచించారు. చెరువుల చుట్టూ పార్కులు అభివృద్ధి చేసి గ్రీనరీ పెంచాలని, ప్రతి చెరువును ఒక పర్యాటక కేంద్రంలా తీర్చిదిద్దాలని అన్నారు.
భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యం
సీనియర్ సిటిజన్లు, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. పతంగుల పండుగ ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరగాలంటే జీహెచ్‌ఎంసీ, పర్యాటక శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం అవసరమన్నారు. చెరువుల వద్ద భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు.
నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి
వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో చెరువుల్లో నీటిని నిల్వ చేసేందుకు ఎస్టీపీలను త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. మూసీ నది ప్రక్షాళన కొనసాగుతున్న సమయంలో, చెరువుల నుంచి శుద్ధి చేసిన నీరు మూసీలో చేరేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు నిర్మించడం ద్వారా పరిసర ప్రాంతాల నుంచి వర్షపు నీరు సులభంగా చెరువులోకి వచ్చేలా ఛానళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు.
మునుపు మురుగు నీటితో నిండిపోయి ఆక్రమణలకు గురైన చెరువులను హైడ్రా అభివృద్ధి చేయడంతో అవి ఇప్పుడు పండుగల వేదికలుగా మారుతున్నాయి. ఇటీవల అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట బతుకమ్మ ఉత్సవాలకు వేదికగా నిలవగా, ఈసారి సంక్రాంతి సందర్భంగా బతుకమ్మ కుంటతో పాటు తమ్మిడికుంట, నల్ల చెరువు, పాతబస్తీలోని బమ్–రుక్న్–ఉద్–దౌలా చెరువులు పతంగుల పండుగకు వేదికలుగా మారనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: