తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం TS నుండి TG(TS to TG)గా మారిన నేపథ్యంలో, హైదరాబాద్ నగర పోలీసు వాహనాల నెంబర్ ప్లేట్‌లలో మార్పు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ పరిణామం ద్వారా నగర వీధుల్లో తిరిగే పోలీసు వాహనాలకు కొత్త రూపు వచ్చనుంది.
కొత్త TG నంబర్ ప్లేట్లతో 134 వాహనాలు విధుల్లోకి
హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand)సూచనల మేరకు, మొదటి దశలో 134 పెట్రోలింగ్ వాహనాలు ‘TG’ నంబర్ ప్లేట్లతో తిరిగి విధుల్లోకి ప్రవేశపెట్టబడ్డాయి. ఈ వాహనాలు ప్రధానంగా నేరాల నియంత్రణ, అత్యవసర కాల్స్‌కు స్పందన, శాంతి భద్రతల నిర్వహణకు ఉపయోగపడతాయి.

మొత్తం 188 వాహనాలకు నూతనీకరణ – రూ.1.6 కోట్లు వ్యయం
సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) ఆధ్వర్యంలో మొత్తం 188 పోలీసు వాహనాలపై మార్పులు చేపడుతున్నారు. పాత నంబర్ ప్లేట్లను తొలగించడం, డోర్లు, బంపర్లు పెయింటింగ్ చేయడం, ఇంజిన్ మరమ్మతులు తదితర పనుల కోసం రూ. 1.6 కోట్లు వ్యయించారు.
తదుపరి దశలో ట్రాఫిక్ వాహనాలకి ‘TG’ ప్లేట్లు
పెట్రోలింగ్ వాహనాల తర్వాత, ట్రాఫిక్ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, పైలట్, ఇంటర్‌సెప్టర్ వాహనాలకూ TG నంబర్ ప్లేట్లను అమర్చే ప్రణాళికపై అధికారులు పని చేస్తున్నారు. ఈ మార్పు నేపథ్యంలో డ్రైవర్లకు వాహనాలను శుభ్రంగా, కండిషన్‌లో ఉంచాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.
రాష్ట్ర సంక్షిప్త నామ మార్పు వెనుక కారణం
2024 ఫిబ్రవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ‘TS’ స్థానంలో ‘TG’ సంక్షిప్త నామాన్ని అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సమర్థిస్తూ, గత ప్రభుత్వం ఎలాంటి నియమాలు పాటించకుండానే TS కోడ్‌ను ఎంచుకుందని విమర్శించారు.
కేంద్రం నుండి అనుమతి – అన్ని శాఖల్లో అమలు
కేంద్ర రోడ్డు రవాణా శాఖ ‘TG’ కోడ్‌ను అధికారికంగా ప్రకటించడంతో, రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, సంస్థలు కొత్త నంబర్ ప్లేట్ల అమలులో భాగస్వామ్యమవుతున్నాయి. ఇది అధికారిక ప్రాసెస్‌ను పూర్తి చేయడంలో ముఖ్యమైన అడుగు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: