Hyderabad Metro : హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఎల్ అండ్ టీ (L&T) నిర్వహిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను (Hyderabad Metro) తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. రెండో, మూడో దశ విస్తరణ పనులను వేగంగా అమలు చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎల్ అండ్ టీ రెండో దశలో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఇప్పటివరకు దేశంలో మొదటి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంగా నడిచిన హైదరాబాద్ మెట్రో ఇకపై పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రతినిధులతో సమావేశమై అప్పులపై కీలక చర్చలు జరిపారు. ప్రస్తుతం తొలి దశ మెట్రోపై దాదాపు రూ.13 వేల కోట్ల అప్పు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం దీనిని భరించేందుకు అంగీకరించింది. ఎల్ అండ్ టీ వాటా విలువ రూ.5,900 కోట్లు కాగా, ఇందులో మొదటిగా రూ.2,000 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది.
రెండో దశ ప్రాజెక్ట్‌లో ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గడం వల్ల ఎల్ అండ్ టీ ముందుకు రాకుండా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ “ఇకపై ఈ రంగంలో భాగస్వామ్యం చేయడం సాధ్యం కాదు” అని స్పష్టం చేశారు.

ఇకపై మెట్రో విస్తరణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుంది. 163 కిలోమీటర్ల అదనపు నెట్‌వర్క్ ప్రణాళికలో పెట్టి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా, అనుమతులు పొందడంలో ఆలస్యం అవుతోంది.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం వల్ల సమన్వయం సులభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల రాబోయే రెండో దశ పనులు వేగంగా జరిగే అవకాశముంది. ఇప్పటివరకు ఢిల్లీలోనూ ఇతర నగరాల్లోనూ మెట్రో రైళ్లు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వ ప్రాజెక్ట్‌గా మారబోతోంది.
ఈ మార్పుతో పౌరులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం నమ్ముతోంది.
Read also :