సింగరేణి కార్మికుల బోనస్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)మాటలు పెద్దవి అయినా, చేతల్లో మాత్రం శూన్యం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
లాభాలు ఉన్నా పూర్తి వాటా ఇవ్వని తీరు
ఈ ఏడాది సింగరేణి సంస్థకు రూ. 6,394 కోట్ల లాభం వచ్చినా, బోనస్ లెక్కల కోసం కేవలం రూ. 2,360 కోట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం అన్యాయమని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లో తక్కువ మొత్తాన్ని తీసుకుని వాటా పెంచినట్టు చూపించడం ఓ మోసమేనని అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వ విధానం వేరే, ప్రస్తుతది వంచన
తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ నికర లాభం ఆధారంగానే కార్మికులకు బోనస్(Bonus) ఇచ్చామని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల్లో మూడో వంతు పక్కనపెట్టి మిగిలిన లోపు వాటా ఇవ్వడం అన్యాయమన్నారు. గతేడాది కూడా ఇదే విధంగా 50% లాభాలపై కోత విధించారని తెలిపారు.
ప్రభుత్వం సమాధానం చెప్పాలి
భవిష్యత్ ప్రణాళికల పేరిట గతేడాది పక్కనపెట్టిన రూ. 2,283 కోట్లతోపాటు, ఇప్పుడు మరో రూ. 4,034 కోట్ల లాభాలపై ఏమైంది అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుగా రావాల్సిన బోనస్‌ను ఎవరికి మళ్లిస్తున్నారో వెల్లడించాలన్నారు.
సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేస్తూ, ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకుని మొత్తం నికర లాభంపై 34% బోనస్ ప్రకటించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ నెరవేరేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: