తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మళ్లీ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)కు సంబంధించి ,ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి 42 సార్లు వెళ్లినప్పటికీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని ఆయన విమర్శించారు.
హరీశ్ రావు ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్:
2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేటాయించిన MGNREGS ఉపాధి పనిదినాలను 12.22 కోట్ల నుంచి కేంద్రం 6.5 కోట్లకు తగ్గించింది. అంటే సగానికి పైగా కోత పడింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 42 సార్లు వెళ్లారు. అయినప్పటికీ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదు, కేంద్రం అన్యాయ విధానాలకు లోబడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన తీరును బట్టబయలుచేస్తోంది. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఈ తీవ్ర అన్యాయంపై మౌనంగా ఉన్నారు. వారి పని ప్రజల తరఫున నిలబడటం కాకుండా, రాజకీయ పార్టీ విధానాల వెనుక దాక్కోవడమే. ఇది దురదృష్టకరం, అని ఆయన అన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని గ్రామీణ పేదలు జీవనాధారం లేని పరిస్థితిలో ఉన్నారు. కేంద్రం వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి, ఉపాధి పనిదినాల సంఖ్యను పునరుద్ధరించాలి. కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనిదినాలను పెంచాలని, బకాయిలను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
Read also:Group-1 : గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్