తెలంగాణలో ఎక్కువ మంది ప్రజల ఆహారపు అలవాట్లలో నాన్‌వెజ్ (Non-veg) ప్రధాన స్థానం సంపాదించుకుంది. మటన్, చికెన్ వంటి వంటకాలు ఏ విందులోనైనా తప్పనిసరిగా ఉండేలా మారాయి. కానీ అదే సమయంలో పోషక విలువలు అధికంగా ఉన్న చేపలకు మాత్రం ప్రాధాన్యం తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది.
మత్స్యశాఖ తాజాగా విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 72.1 శాతం మంది ప్రజలు చేపలను ఆహారంగా తీసుకుంటుంటే, తెలంగాణ (Telangana) లో మాత్రం ఈ శాతం 58కే పరిమితమైందని నివేదిక పేర్కొంది. అంటే ఉత్పత్తి పరంగా మంచి స్థాయిలో ఉన్నా, వినియోగం విషయంలో మాత్రం తెలంగాణ వెనుకబడింది.
వినియోగంలో మాత్రం 14వ స్థానం
సగటు తలసరి చేప (Fish) ల వినియోగం విషయంలో కూడా తెలంగాణ దేశ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. దేశంలో సగటు తలసరి వినియోగం 13.1 కిలోలుగా ఉంటే, తెలంగాణలో అది కేవలం 8.37 కిలోలకే పరిమితమైంది. ఈ పరంగా చూస్తే, తెలంగాణ దేశంలో 14వ స్థానంలో నిలిచింది.

ఉత్పత్తి విషయానికి వస్తే రాష్ట్రం వెనుకబడలేదు. ప్రతి సంవత్సరం తెలంగాణలో సుమారు 4.77 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఉత్పత్తితో దేశంలో 9వ స్థానంలో నిలుస్తున్నా, వినియోగంలో మాత్రం 14వ స్థానంలో ఉండటం విశేషం. అంటే ఉత్పత్తి సామర్థ్యం (Production capacity) ఉన్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడం లేదా అలవాట్లు మారకపోవడం వల్ల చేపల వినియోగం పెరగడం లేదు.
చేపల శుభ్రత విషయంలో ప్రజల్లో ఉన్న అపోహల కారణంగా
నిపుణుల అభిప్రాయం ప్రకారం, చేపలు ప్రోటీన్ (Protein) తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా కలిగి ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి, అలాగే రోగనిరోధక శక్తి పెంపొందించడానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు చేపలు తింటే మరింత శక్తి, ఆరోగ్యం పొందగలరు.అత్యధిక వినియోగం త్రిపుర (27.62 కిలోలు), కర్ణాటక (20.72 కిలోలు), కేరళ (20.65 కిలోలు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
అత్యల్ప వినియోగం రాజస్థాన్ (0.8 కిలోలు), పంజాబ్, హర్యానా (0.3 కిలోలు) చివరి స్థానాల్లో ఉన్నాయి. కేరళ (53.5%) గోవా (36.2%) రాష్ట్రాల ప్రజలు రోజూ చేపలు తింటున్నారు.తెలంగాణలో, ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో మటన్, చికెన్, గుడ్లతో పోలిస్తే చేపలు తక్కువగా లభిస్తున్నాయి. చేపల శుభ్రత విషయంలో ప్రజల్లో ఉన్న అపోహల కారణంగా విందులు, ఇతర సందర్భాల్లో వాటిని తక్కువగా ఉపయోగిస్తున్నారు. తెలంగాణతో పాటు తక్కువ వినియోగం ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు చేపల పోషక విలువలపై అవగాహన కల్పించాలని జాతీయ మత్స్యశాఖ సూచించింది. చేపల వాడకం పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: