ఫైర్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అగ్ని ప్రమాదాల నివారణపై విశేషమైన సూచనలు చేశారు. హైడ్రా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఒక్క అగ్ని ప్రమాదం కూడా జరగకుండా నివారించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అగ్ని ప్రమాదాల నివారణకు సరైన ఫైర్ సేఫ్టీ విధానాలు పాటించడం అత్యవసరమని, అందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం అని చెప్పారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి
తరచూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలపై డేటా సేకరించి, వాటి వెనుక ఉన్న కారణాలను విశ్లేషించడంతో నివారణ మరింత సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఫైర్ సేఫ్టీపై మరింత అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్స్ రూపొందించాలని సూచించారు.
అగ్ని ప్రమాదాల నివారణకు వినియోగించే పరికరాలపై సమగ్ర అవగాహన
ఈ కార్యక్రమంలో హైడ్రా ఫైర్ విభాగం అదనపు సంచాలకులు పాపయ్య, ఎస్‌పీ సుదర్శన్, రీజనల్ ఆఫీసర్ జయప్రకాశ్ లు పాల్గొన్నారు. ఆసుపత్రులు, కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రతినిధులు పాల్గొని విలువైన సూచనలు చేశారు. అగ్ని ప్రమాదాల నివారణకు వినియోగించే పరికరాలపై సమగ్ర అవగాహన అవసరమని, అవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.