ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలపై విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు అందించే కాలేజీల్లో అక్రమాలు జరిగినట్టు వచ్చిన నివేదికలపై ప్రభుత్వం దృష్టిసారించింది. పోలీస్ శాఖ, విద్యాశాఖ కలిసి ఈ తనిఖీలను సమగ్రంగా నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, బకాయిలు విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ప్రయివేట్ కాలేజీలు నవంబర్ 3 నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, విజిలెన్స్ ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి.
Latest News: Bihar Polls: బిహార్ ఎన్నికల్లో నేరారోపణల నీడ..
ప్రభుత్వ హామీలు నిలబెట్టలేదన్న కారణంతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దసరా నాటికి రూ. 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పినా, కేవలం రూ. 200 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీపావళి నాటికి మొత్తం బకాయిలు చెల్లిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, ఆ మాట నిలవలేదు. ఈ నేపథ్యంలో సమాఖ్య నేతలు పలువురు మంత్రులను కలిసి సమస్య వివరించినా ఫలితంలేకపోవడంతో, బంద్‌కే మొగ్గు చూపాల్సి వచ్చింది. తమను బెదిరించే ప్రయత్నాలు సాగినా, వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద స్థాయిలో ఛలో హైదరాబాద్ చేపడతామని కూడా హెచ్చరించారు.

రాష్ట్రంలో 2,500 ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో 15 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. కాలేజీలు మూసివేత సాగితే, విద్యార్థుల అకడమిక్ సంవత్సరం దెబ్బతిన్నే అవకాశం ఉంది. ఒకవైపు ఆర్థిక ఒత్తిడి, మరోవైపు విజిలెన్స్ తనిఖీలు… ఈ రెండు కారణాలు సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఇదే అంశంపై ఎస్‌ఎఫ్ఐ కూడా బంద్ పిలుపు ఇవ్వడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ప్రభుత్వం, కాలేజీల మధ్య సర్దుబాటు జరగకపోతే, చివరికి విద్యార్థుల భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేళ ప్రభుత్వం త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకొని సంక్షోభానికి ముగింపు పలకాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/