తెలంగాణలో కలకలం రేపిన రూ.4,215 కోట్ల ఫాల్కన్ యాప్ (Falcon App) స్కామ్‌లో మరో కీలక మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడు, ఫాల్కన్ గ్రూప్ సీఎస్సీ ఆఫీసర్ (COO) ఆర్యన్ సింగ్ (Aryan Singh)ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. భటిండాలో అతడు పట్టుబడి, హైదరాబాద్‌కి ట్రాన్సిట్ రిమాండ్‌తో తరలించారు.క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ అనే యాప్ ద్వారా మోసం చేసింది. MNC పేర్లను వాడుతూ నకిలీ డీల్స్ సృష్టించింది. చిన్నకాలం పెట్టుబడులకు ఎక్కువ లాభాలు ఇస్తామని ప్రలోభపెట్టింది. సోషల్ మీడియా, టెలీకాల్స్ ద్వారా ప్రచారం చేసి వేలాది మందిని నమ్మించింది.

7 వేల మందిని మోసగించిన ముఠా
సీఐడీ విచారణ ప్రకారం, దేశవ్యాప్తంగా 7,056 మంది బాధితులు ఈ స్కామ్ బారిన పడ్డారు. వీరిలో 4,065 మంది రూ.792 కోట్లు నష్టపోయారు. ఈ మోసానికి సంబంధించి సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తును తర్వాత సీఐడీకి బదిలీ చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఈ కంపెనీపై మొత్తం 8 కేసులు ఉన్నాయి.
ఆర్యన్ సింగ్ పాత్ర
ఆర్యన్ సింగ్ ఈ స్కామ్‌కి కీ ప్లేయర్‌గా వ్యవహరించాడు. కంపెనీ ఎండీ అమర్ దీప్‌తో కలిసి నేరాన్ని ముందుండి నడిపించాడు. బాధితులతో నేరుగా మాట్లాడి నకిలీ రశీదులు ఇచ్చాడు. అతడు ఒక్కడే రూ.14.35 కోట్ల డిపాజిట్లు వసూలు చేశాడు. అలాగే కంపెనీ నిధుల నుంచి రూ.1.62 కోట్లను తన ఖాతాలోకి మార్చుకున్నాడు.
అరెస్ట్ ఎలా జరిగింది?
నేరం బయటపడగానే ఆర్యన్ మొదట నాందేడ్‌కు, తర్వాత భటిండా వెళ్లి ఒక గురుద్వారాలో దాగిపోయాడు. గూఢచారుల సమాచారం మేరకు సీఐడీ ప్రత్యేక బృందం అతడిని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో అతడి వద్ద రెండు సెల్‌ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Read Also : Narendra Modi : బ్రిక్స్ సదస్సులో మోదీ ఘాటు ప్రసంగం