తెలంగాణ రాష్ట్రంలో అన్ని అత్యవసర సేవల కోసం ఒకే నంబర్ వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రజలు డయల్ 100 (పోలీసు), 108 (ఆరోగ్య అత్యవసర సేవలు), 101 (అగ్నిమాపక) వంటి విభిన్న నంబర్లను ఉపయోగించేవారు. కానీ ఇక నుంచి ఈ సేవలన్నింటినీ ‘డయల్ 112’ అనే ఒక్క నంబర్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
డయల్ 112 సేవలను రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ అత్యవసర సేవలను ప్రారంభించనున్నారు. ఈ ప్రణాళిక వల్ల ప్రజలకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ 112 సేవలను సమర్థవంతంగా నిర్వహించనున్నారు. పోలీసు, అగ్నిమాపక, వైద్య అత్యవసర సేవలు అన్నింటినీ ఒకే చోట సమన్వయం చేసి బాధితులకు తక్షణ సహాయం అందించనున్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో సమయాన్ని ఆదా చేస్తుందని, సేవల విభజనలో స్పష్టత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 112 నంబర్‌ను అత్యవసర సేవల కోసం ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నంబర్ ద్వారా ఒకే కాల్‌తో అవసరమైన సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజల భద్రత, అత్యవసర సహాయం అందించడంలో డయల్ 112 ప్రణాళిక కీలకమైన అడుగుగా కనిపిస్తోంది. ఒకే నంబర్ ద్వారా అన్ని సేవలు అందడం వల్ల ప్రజలకు పెద్దగా గందరగోళం లేకుండా వేగంగా సేవలు అందుతాయి. ముఖ్యంగా అర్జెంటు పరిస్థితుల్లో ఈ కొత్త వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా మారనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.