ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ రోజు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను (Aarogyasri Services ) బంద్ చేస్తామని ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి బెదిరింపులు చేయడం అసహ్యకరమని ఆయన వ్యాఖ్యానించారు.
నిధుల విడుదలలో ఆలస్యం లేదని స్పష్టం
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలకు రూ.75 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రతిసారీ ఆస్పత్రులు నిధుల పేరుతో బెదిరింపులకు దిగడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు.
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రతి నెలా ఈ తరహా బంద్ హెచ్చరికలు ఇవ్వడం ఒక తంతుగా మారిందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇకపై ఇలాంటి ఒత్తిడికి లొంగేది లేదని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడదని ఆయన స్పష్టం చేశారు.