తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ రివర్ పై బోటు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతుల గురించి వివరంగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. నదుల పునరుజ్జీవనం, నీటి నిర్వహణ విధానాలు, సంరక్షణ పద్ధతులపై ముఖ్యంగా దృష్టి సారించారని వెల్లడించారు.
సింగపూర్ రివర్ ప్రాజెక్టు ద్వారా అందులోని నీటి నిర్వహణ, పునరుద్ధరణ పద్ధతులు ముఖ్యమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. నదుల పునరుజ్జీవనం మరియు నీటి వనరుల సమర్థ వినియోగం రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్లోని ముసీ నది పునరుజ్జీవనానికి సింగపూర్ మోడల్ మార్గదర్శిగా ఉపయోగపడుతుందని , ఈ పర్యటనలో భాగంగా వారసత్వ భవనాల పునరుద్ధరణ, సంరక్షణపై అక్కడి చర్యలను పరిశీలించినట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్లో కూడా వారసత్వ కట్టడాలను పునరుద్ధరించి, అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వీటిని నూతన ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం ఎలా అనేది అధ్యయనం చేశారని పేర్కొన్నారు.
సింగపూర్ లోని ఐకానిక్ భవనాలు, కార్యాలయాలు, నివాసాల నిర్వహణ విధానాలను పరిశీలించిన సీఎం రేవంత్, వీటి ద్వారా నగర అభివృద్ధికి కొత్త ఆలోచనలు తెచ్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలను తీర్చడంతోపాటు భవన నిర్మాణంలో విశిష్టతను చాటేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. సింగపూర్ లో నేర్చుకున్న ఉత్తమ పద్ధతులను తెలంగాణలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సంకల్పించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యమని ట్వీట్ చేశారు.