తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి(Telangana BJP President)కి సంబంధించి నూతన నాయకుడి ఎంపికపై చర్చలు సాగుతున్న సమయంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. “ఇప్పటి వరకు బీజేపీ అధిష్ఠానం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు,” అని తెలిపారు. బీజేపీ ప్రజాస్వామ్య విధానాలను అనుసరించే పార్టీ కావడంతో, ఎవరికైనా నామినేషన్ వేసే అవకాశం ఉందని, వాటిని పరిశీలించిన తర్వాతే అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.
చంద్రబాబు ప్రమేయంపై క్లారిటీ
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రమేయం ఉందన్న ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. ‘‘ఇలాంటి అసత్య ప్రచారాలు నిరాధారమైనవే. ఎవరో చెప్పారు కాబట్టి నాయకుడిని ఎంపిక చేస్తే, అది బీజేపీ విధానం కాదు. మా పార్టీ లోపల స్పష్టమైన వ్యవస్థ ఉంది,’’ అని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా బీజేపీ అంతర్గత వ్యవహారం అని, ఇతర పార్టీల నేతలకు ఇందులో ఎలాంటి సంబంధం లేదన్నారు.
ప్రచారాలపై తప్పుడు అభిప్రాయాల వద్దు
బండి సంజయ్ మరోసారి ప్రజలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు – తప్పుడు ప్రచారాలకు బలి కాకుండా, అధిష్ఠానం అధికారికంగా ప్రకటించే దాకా ఎదురుచూడాలంటూ. పార్టీ అభివృద్ధి, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎవరెవరు నామినేషన్ వేసినా, చివరికి నాయకుని ఎంపిక చేయగల శక్తి అధిష్ఠానానిదే అని ఆయన తేల్చిచెప్పారు.
Read Also : Shimla : భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం