తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) రోడ్డు ప్రమాద బాధితులకు సంబందించి శుభవార్త చెప్పారు. ప్రమాదం జరిగిన వారంలోపు బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స (Cashless treatment) అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సౌకర్యం కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద పొందుపరిచిన చొప్పదండి, జగిత్యాల, మెదక్ తదితర జిల్లాల్లోని ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానుంది. ఈ పథకంతో బాధితులు ఆసుపత్రిలో వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా పోతుందని మంత్రి తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రుల్లోనే వర్తింపు
ఈ పథకం కింద నగదు రహిత వైద్యం ఆయుష్మాన్ భారత్ పథకానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించాల్సిందిగా, అలాగే ఈ-దార్ (e-DAR) పోర్టల్ లో వివరాలు నమోదు చేయాలని మంత్రి సూచించారు. సమాచారం నమోదైన వెంటనే బాధితులకు చికిత్స కోసం ప్రాసెస్ మొదలవుతుందని తెలిపారు. ఇందులో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా భాగస్వాములవుతాయని చెప్పారు.
కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం
ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఇది నిజంగా ప్రజలకు అవసరమైన, ప్రాణాలను కాపాడగలిగే చొరవ అని కొనియాడారు. ఈ పథకంతో ప్రతి రోడ్డు ప్రమాద బాధితుడు సరైన సమయంలో మెరుగైన వైద్యం పొందగలడని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ అంశంపై పోలీస్, వైద్య, రవాణా శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
Read Also : Big Alert : వెంటనే అకౌంట్స్ పాస్ వర్డ్స్ మార్చుకోండి