తెలంగాణలో నెలకొన్న యూరియా కొరత(Urea Shortage)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ (రాజకీయ వ్యవహారాల కమిటీ) సమావేశంలో స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరతను సృష్టించి, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఆ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని సీఎం అన్నారు. ఈ సమస్యను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని కేటీఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోంది” అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల అవసరాలను బేరం పెడుతున్నారని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలను రాజకీయం చేయడం బీఆర్ఎస్ పార్టీకి తగదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం తాను నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిసినట్లు సీఎం వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలని ఆదేశాలు
యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంపిణీపై మానిటరింగ్ పెంచాలని ఆయన సూచించారు. యూరియా కొరతను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, కావాలని కొందరు ఈ సమస్యను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, వారికి అవసరమైన యూరియాను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.