తెలంగాణ ప్రభుత్వమే కాదు, ప్రతి నిరుద్యోగ యువకుడి భవిష్యత్తును నిర్మించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో భూమిని కోల్పోయిన 112 మందికి జెన్‌కోలో ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. నియామక పత్రాలను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మిన యువత ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పారు. ఇప్పుడు ఆ ఆశలు నెరవేరుతున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే 53 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు.గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామన్నా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. భూములు కోల్పోయిన వారు వృద్ధులైపోయినా ఉద్యోగం రాలేదని అన్నారు.ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాద్యతను తీసుకున్నదని తెలిపారు.

వెంటనే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా యువత నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ పథకం కోసం రూ. 9 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఇది లక్షలాది యువతకు ఆర్థిక స్వావలంబనను తీసుకురావడం లక్ష్యంగా ఉందని వివరించారు.ఇక పెట్టుబడుల విషయానికి వస్తే – హైదరాబాద్ లో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు.రాజీవ్ గాంధీ సూచనతో నేదురమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. నేడు అదే హైటెక్ సిటీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు.ఇక త్వరలో ఏర్పాటయ్యే ఫ్యూచర్ సిటీ ద్వారా మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం ఉందని చెప్పారు.హైదరాబాద్ విస్తరణతో పాటు పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.