Bachupally Fire Accident: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో మంగళవారం రాత్రి పెను ప్రమాదం సంభవించింది. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ మార్కెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, వ్యాపారులు కోట్లాది రూపాయల ఆస్తులను కోల్పోయారు.
మంగళవారం రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో ఓ ఫర్నిచర్ దుకాణంలో మంటలు మొదలయ్యాయి. దుకాణాల్లో కలప (Wood), ఫోమ్, పాలిష్ కెమికల్స్ వంటి త్వరగా మండే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో మంటలు క్షణాల్లోనే పక్కనున్న షాపులకు వ్యాపించాయి. అక్కడ ఉన్న సుమారు 25 దుకాణాల్లో 18 షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
Read Also: Petrol Bunks : తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు

షార్ట్ సర్క్యూటే కారణమా?
కొందరు వ్యాపారులు తమ దుకాణాల్లోనే నివాసం ఉంటుండటంతో అక్కడ వంట గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్నాయి. మంటల వేడికి ఈ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి భారీ శబ్దాలతో పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుళ్ల వల్ల మంటల తీవ్రత మరింత పెరిగి, నియంత్రించడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆరుకు పైగా ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారని అధికారులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్షల విలువైన కలప సామాగ్రి కళ్లముందే బూడిదవ్వడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: