Telangana : అకాల వర్షాలు: రైతుల కలలను చెదిపేసిన వరుణుడు
తెలంగాణ రైతులను వరుణుడు వదలడం లేదు. ఎండలు భగ్గుమన్న వేళ, అనూహ్యంగా కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కంటతడి పెట్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వానలు, ఈదురు గాలులతో కలసి ప్రకృతి బీభత్సాన్ని సృష్టించాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్, వరంగల్, ములుగు, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోయాయి.రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన పంటలు చేతికి అందే సమయానికే మట్టిలో కలిసిపోయాయి. మామిడి, వరి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలే కాకుండా కూరగాయల పంటలూ తీవ్రంగా నష్టపోయాయి. అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో మామిడి కాయలు నేలరాలిపోవడంతో రైతులకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. వడగండ్ల వానల ధాటికి చేతికి వచ్చిన వరి నేలవాలిపోగా, ధాన్యం నీటిలో తడిసి ముద్దయింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు కనీసం పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.

అకాల వర్షాలు: రైతుల కలలను చెదిపేసిన వరుణుడు
ఈ వర్షాల ధాటికి పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో కొన్ని ఇళ్లపై పైకప్పులు గాల్లోకి ఎగిరిపోయాయి. జనాల్లో భయం, ఆందోళన నెలకొంది. పంటలు మునిగిపోవడంతో రైతులు ప్రభుత్వ సహాయంపై ఆశలు పెట్టుకున్నారు. వడ్ల ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో మార్కెట్‌లో ధర పడిపోతుందనే భయంతో రైతులు “ప్రభుత్వమే కొనుగోలు చేయాలి” అంటూ డిమాండ్ చేస్తున్నారు.ప్రాథమికంగా 21 వేల ఎకరాల్లో పంట నష్టపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు తక్షణమే పరిహారం అందించాలని, ప్రకృతి విపత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కర్షకులు కోరుతున్నారు. వర్షం వల్ల నష్టపోయిన ప్రతి రైతు వెనుక ఒక కుటుంబం నిలబడినదే అనే దృష్టితో ప్రభుత్వ మద్దతు అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Read More : Terror Attack : ఈరోజు కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్దతు