తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అవినీతిపై నిఘా మరింత కఠినమవుతోంది. అవినీతి నిరోధక శాఖ (ACB) గురువారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టి కలకలం రేపింది. అవినీతికి పాల్పడుతున్న ఆర్టీఏ (RTA) అధికారులు, ఖాతాదారులను మోసం చేస్తున్న బినామీ ఏజెంట్లపై నిరంతరంగా వస్తున్న ఆరోపణలతో ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
హైదరాబాద్‌తో ప్రారంభమైన విస్తృత దాడులు
హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలైన ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్‌ల పర్యవేక్షణలో అధికారులు కార్యాలయాల్లోని రికార్డులను, కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇద్దరు క్లర్క్‌లతో పాటు కార్యాలయం వద్ద తిష్టవేసిన 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం తలుపులు మూసివేసి, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిలిపివేసి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా, ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, సుమారు 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
పెద్దపల్లి, జిల్లాల్లో కూడా దాడులు
హైదరాబాద్ నగరంతో పాటు పెద్దపల్లి తదితర జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతుండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.