హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించినా మందుబాబుల తీరు మారలేదు. మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31న నిర్వహించిన తనిఖీలలో 1,184 మంది పట్టుబడ్డారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరధిలో మంగళవారం 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.

న్యూ ఇయర్ వేడుకలు అంటే ఇంటి వద్ద ప్రశాంతంగా జరుపుకోవాలని, లేకపోతే మద్యం సేవించినా.. డ్రైవింగ్ చేయడానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని ముందుగానే హెచ్చరించారు. క్యాబ్ లాంటివి బుక్ చేసుకుని ఇళ్లకు వెళ్లాలని, లేక తమకు చెప్పినా ఏదో విధంగా మందుబాబులు సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, నగర వ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236కేసులు నమోదు అయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్ లో 192 కేసులు, వెస్ట్ జోన్ లో 179, సౌత్ వెస్ట్ జోన్ లో 179 , నార్త్ జోన్ లో 177 సెంట్రల్ జోన్ లో 102 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక రోడ్లపై పోలీసులు తనిఖీలను చూసి కొందరు మందుబాబులు తమ బైక్స్ వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు.