తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్‌కు చెందిన నిజాముద్దీన్ (Mohammed Nizamuddin) (32) అమెరికాలో దుర్మరణం పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2016లో ఎంఎస్ చదవడం కోసం అమెరికా వెళ్లిన అతడు, చదువులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం దొరకకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 3న అతని నివాసంలో రూమ్మేట్స్ మధ్య గొడవ జరిగిందని పోలీసులు సమాచారం అందుకున్నారు.
పోలీసుల ప్రకటన ప్రకారం.. ఆ గొడవలో నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేశాడని , ఆ సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు (‘shot dead’ by police in U.S) జరపాల్సి వచ్చిందని, అందులో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారికంగా నమోదు చేసిన నివేదికలో “సెల్ఫ్ డిఫెన్స్‌లో కాల్పులు జరిపాం” అని పోలీసులు పేర్కొన్నారు.
ఈ సంఘటనపై నిజాముద్దీన్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చదువుకోసం వెళ్లిన కుమారుడు ఇలాంటి పరిణామాల వలన ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులకు భరించలేని దుఃఖాన్ని మిగిల్చింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు కమ్యూనిటీ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.