హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఇప్పటికే సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ట్యూషన్లు పెట్టించుకుని మరీ చదువుతుంటే.. మరికొంత మంది గ్రూప్ స్టడీస్ చేస్తూ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు అందించిన హాల్ టికెట్స్‌లో 15 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తారని నిబంధన ఉన్నప్పటికీ.. ఆ రూల్‌ను ఖచ్చితంగా అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.

నిమిషం నిబంధన ఎత్తివేత..
ఒక్క నిమిషం నిబంధన అనేది అమలు చేయడం లేదని.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇస్తున్నామని ప్రకటించారు. ఇది విద్యార్థులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే.. కొంతమందికి ఎగ్జామ్ సెంటర్ చాలా దూరంగా పడుతుంది. గంటల సమయం ముందే బయలుదేరినా.. ట్రాఫిక్ కారణంగానో లేదా ఇతర కారణాలతో సెంటర్‌కు రీచ్ అవ్వలేకపోతారు. అప్పుడు ఎగ్జామ్ రాయనివ్వకపోతే విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు
కాగా ,ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 9,96,541 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4,88,316 ఉండగా, సెకండియర్ విద్యార్థులు 5,08,225 మంది ఉన్నారు. మరోవైపు, పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 అమలులో ఉంటుందని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో మూడు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. ఇప్పటికే పరీక్షా పత్రాలు ఆయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి.