తెలంగాణలో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు శనిలా పట్టిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళల భద్రత, ప్రభుత్వ హామీల అమలు అంశాల్లో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని ఆమె విమర్శించారు.
“కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సొంత లాభాల కోసం పని చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత దారుణ పరిస్థితుల్లో ఉంది. ప్రతి మూడు గంటలకోసారి లైంగిక దాడి జరుగుతుండటం బాధాకరం” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి దుష్టపాలనతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ప్రగతిశీల తెలంగాణ కోసం కేసీఆర్ శ్రమించి సాధించిన విజయాలను కాంగ్రెస్ నేతలు నాశనం చేస్తున్నారు. ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా, వారి నమ్మకాలను ద్రోహం చేస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించిన కవిత, “కేసీఆర్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ తీరుపై ప్రశ్నించాలని, వారికి బదులు చెప్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. కాంగ్రెస్ హామీలను గాలికొదిలేసి, ప్రజల నమ్మకాన్ని వంచిస్తున్నారు. ప్రజలు తక్షణమే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి అని ఆమె పేర్కొన్నారు.