హైదరాబాద్: యాసంగి పంటలపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు ఇచ్చింది. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి పంటలకు నీటి నిర్వహణ సమర్ధవంతంగా జరిగేలా కలెక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు శాంతి కుమారి. గతేడాదితో పోలిస్తే నికర సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో నీటి లభ్యత చాలా సౌకర్యంగా ఉందని, యాసంగి సీజన్‌ను బాగా చూసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

రైతులకు అవగాహన
రాబోయే పది రోజులలో విద్యుత్, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలని, విద్యుత్ సరఫరాలో ప్రస్తుత పరిస్థితి సౌకర్యవంతంగా ఉందన్న సీఎస్ జిల్లాలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని, క్షేత్ర స్థాయిలో సమర్ధవంతమైన నిర్వహణ ఉండే విధంగా జిల్లా కలెక్టర్లు పర్యేవేక్షించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా తగినంత పరిమాణంలో ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
21 చోట్ల కొనుగోలు కేంద్రాలు
కాగా, రాష్ట్రంలో రైతు పండించిన పంటలు కేంద్రం కొనుగోలు చేయకపోయినా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇప్పటికే ప్రొద్దు తిరుగుడు సేకరణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 21 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదు చోట్ల ప్రారంభించామని తెలిపింది. పంట కోతల ప్రకారం మిగతా సెంటర్ల కూడా ప్రారంభిస్తామని, పొద్దు తిరుగుడు పండించిన రైతులు మార్కెట్ ప్రమాణాలకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చి మద్దతు దర పొందాలని కోరింది. ప్రతిపక్ష పార్టీ నేతలపై పొద్దు తిరుగుడు కోనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని పేర్కొనడం సరికాదని తెలిపింది.