తెలంగాణ ప్రభుత్వం..ఏపీ ప్రభుత్వ బాటలో పయనిస్తుందా..? అంటే అవుననే చెప్పాలి. మొన్నటి వరకు తెలంగాణ పథకాలను, తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ఏపీ సర్కార్ అనుసరిస్తే..ఇప్పుడు ఏపీలో అమలవుతున్న పథకాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసి, ఇక్కడ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకున్నారు. తాజాగా తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం (Inter Midday Meals) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ఈ పథకం సక్సెస్ ఫుల్ గా అమలు అవుతుంది. దీనిపై ప్రజలు , విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా ఆ పధకాన్ని అమలు చేయాలనీ చూస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ఈ పథకం రూపకల్పనకు సంబంధించి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వం అంగీకారం తెలుపితే 2025-26 విద్యా సంవత్సరం లో ఈ మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. విద్యార్థులు తినే భోజనంతో వారి శారీరక శక్తి పెరుగుతుందని, అందువల్ల విద్యా సామర్థ్యం మెరుగవుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పథకం ప్రారంభానికి సంబంధించి రాష్ట్రం కోసం కేటాయించాల్సిన నిధులను రాబోయే బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి, వీటిలో సుమారు 1.75 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి మధ్యాహ్న భోజన అవసరాలను తీర్చడం కొంత సవాలుగా మారినప్పటికీ, ఈ పథకం ఆర్థికంగా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రతిపాదనలను పటిష్టపరుస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన అన్ని తత్వాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన భద్రత, నాణ్యత, సరఫరా సమస్యలను కూడా చర్చించి, ప్రభుత్వం సమర్థమైన నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.