తెలంగాణ రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగేళ్లలో 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 75 వేల మంది రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించనుంది. వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులకు ఇది బాట వేస్తుంది. ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాల్లో వెదురు సాగును చేపట్టాలని నిర్ణయించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి జిల్లాను ఎంపిక చేయడం గమనార్హం. అక్కడ సాధించిన విజయాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను ఇతర జిల్లాలకు విస్తరించనున్నారు.
వెదురు సాగు ద్వారా పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయం ప్రోత్సహించడమే కాకుండా, దీనికి సంబంధించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు, వెదురు ఉత్పత్తులతో సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధికి దోహదం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనుంది. రైతులు ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థికంగా బలపడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు అవసరమైన ప్రాధమిక సమాచారం, సాంకేతిక సహాయం కూడా ప్రభుత్వం అందించనుంది.
ఈ ప్రాజెక్ట్ పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ అభివృద్ధి మరియు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక ప్రగతికి దోహదం చేయనుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వెదురు సాగును విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది.