Telangana: భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. భూభారతి చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేసి, భూ సమస్యల పరిష్కారాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రజల్లో భూభారతి చట్టంపై అవగాహన పెంచడానికి బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ చట్ట ప్రయోజనాలు ప్రజలకు చేరాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అవగాహన సదస్సులు ప్రారంభమవుతున్నాయని, అందుకు జిల్లాకలెక్టర్లు నాయకత్వం వహించనున్నారని తెలిపారు. మొదటగా నాలుగు మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలులోకి రానుందని, వీటిలో నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూ సంబంధిత సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, రశీదులు అందజేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఫార్మాట్ రూపొందించి దరఖాస్తులను సదస్సులకు ముందే ప్రజలకు అందించనున్నారు.
జిల్లాల వారీగా పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక

ఈ పైలట్ మండలాల్లో ప్రతి దరఖాస్తును కంప్యూటర్ ద్వారా నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించి, మే 1వ తేదీ నుంచి పరిష్కార ప్రక్రియ ప్రారంభమవుతుంది. కోర్టు పరిధిలో ఉన్న భూముల మినహా మిగిలిన అన్ని భూ సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడనుందని మంత్రి తెలిపారు. పైలట్ మండలాల్లో అమలు చేసిన విధానాన్ని పరిశీలించి, ప్రజల స్పందన ఆధారంగా భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.అవగాహన కార్యక్రమాల భాగంగా, కలెక్టర్లు ప్రతిరోజూ ప్రతి మండలంలో కనీసం రెండు సమావేశాల్లో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్‌లతో బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని మంత్రి స్పష్టం చేశారు. భూభారతి చట్టం ద్వారా భూసమస్యలు లేని Telangana నిర్మించాలన్న ప్రభుత్వ దృష్ఠికోణం ప్రజలకు ఉపయోగపడేలా మారనుంది.
Read more : Bhubharathi : నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు