Instagram : ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టాగ్రామ్ ‘ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా అమెరికాలో చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. గురువారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి లాగిన్, సర్వర్ కనెక్షన్ వంటి సమస్యలు తలెత్తాయి.

యాప్‌లోకి లాగిన్ అవ్వడంలో సమస్యలు
ప్రముఖ టెక్ ట్రాకింగ్ వెబ్ సౌట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం 72 శాతం శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్ అవ్వడంలో సమస్యలు ఎదుర్కోగా.. 24 శాతం మంది సర్వర్ కనెక్షన్ ప్రాబ్లమ్‌ను నివేదించారు. దీంతో యూజర్లు అసౌకర్యానికి గురయ్యారు. తమకు కలిగిన అంతరాయాన్ని పలువురు ఇన్‌స్టా యూజర్లు మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై మెటా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఒకేరోజు మూడుసార్లు ఎక్స్ సేవల్లో అంతరాయం
ఇక, ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ‘ఎక్స్’ (X) డౌన్ అయిన విషయం తెలిసిందే. ఒకేరోజు మూడుసార్లు ఎక్స్ సేవల్లో అంతరాయం కలగడం గమనార్హం. తమ సామాజిక మాధ్యమంపై అతిపెద్ద సైబర్ దాడి జరిగిందని మస్క్ పేర్కొన్నారు. దీని వెనక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్ లేదా ఒక దేశ హస్తం ఉందన్నారు. ఈక్రమంలోనే దీని వెనక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చని మస్క్ అనుమానాలు వ్యక్తంచేశారు. సైబర్ దాడికి పాల్పడిన ఐపీ అడ్రస్‌లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినవేనని తెలుస్తోందన్నారు.