కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచాన్ని కొత్త దిశగా తీసుకెళ్తోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుండగా, ఇప్పుడు ఓపెన్ ఏఐ సంస్థ మరింత ముందడుగు వేసింది. వినియోగదారులకు వర్చువల్ సహాయంగా పని చేసే ఏఐ ఏజెంట్ సేవలను మరిన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ( ట్విట్టర్) ద్వారా వెల్లడించింది.ఈ ఏఐ ఏజెంట్ సేవలు పూర్తిగా ఆటోమేటెడ్‌గా పని చేసేలా రూపొందించబడ్డాయి. వినియోగదారులు ఇచ్చే సూచనల ప్రకారం ఆన్‌లైన్‌లో వివిధ పనులను స్వయంచాలకంగా ( ఆటోమాటిక్ గా) నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది.
చాట్‌జీపీటీ ప్రో
గతంలో ఈ సేవలు అమెరికాలోని చాట్‌జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే పరిమితమై ఉండగా, ఇప్పుడు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారత్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్‌స్టెయిన్, ఐస్‌లాండ్ వంటి కొన్ని యూరోపియన్ దేశాల్లో ఈ సేవలను ఉపయోగించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

సామ్ ఆల్ట్‌మన్
కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చేసే పనిని ఈ ఏఐ ఏజెంట్స్ పూర్తి చేయగలవని గతంలో ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు.అయితే, ఈ ఏఐ ఏజెంట్లు పూర్తి స్వతంత్రంగా ఆలోచించలేవు, కేవలం కేటాయించిన పనిని మాత్రమే పూర్తి చేయగలవు అని ఆయన స్పష్టం చేశారు.అన్ని రంగాల్లో కూడా ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు కానీ, ఆ రంగంపై మాత్రం ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కోడ్ రివ్యూలు, డేటా ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ టాస్క్ మేనేజ్‌మెంట్ వంటి పనుల్లో ఈ ఏఐ ఏజెంట్లు అత్యంత ఉపయోగకరంగా మారబోతున్నాయి.
ఇతర రంగాల్లో
ఏఐ ఏజెంట్ సేవలు కేవలం సాఫ్ట్‌వేర్ రంగానికే కాకుండా ఆర్థిక రంగం, మార్కెటింగ్, విద్య, కస్టమర్ సపోర్ట్ వంటి అనేక విభాగాల్లో ఉపయోగపడతాయి.
ఆర్థిక రంగంలో – డేటా విశ్లేషణ, ట్రేడింగ్ సలహాలు, ఫైనాన్షియల్ ప్లానింగ్
మార్కెటింగ్‌లో – క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్
విద్యారంగం – విద్యార్థులకు అసిస్టెంట్‌గా మారడం, లెసన్ ప్లానింగ్
ఓపెన్ ఏఐ అందించిన కొత్త ఏఐ ఏజెంట్ సేవలు చాలా దేశాల్లో అందుబాటులోకి రావడం సాంకేతిక రంగంలో కీలక పరిణామం. భారతదేశంలో కూడా ఈ సేవలు ప్రారంభం కావడంతో టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, ఫ్రీలాన్స్ డెవలపర్‌లు దీని సద్వినియోగం చేసుకోవచ్చు. కృత్రిమ మేధస్సు విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్న ప్రస్తుత తరుణంలో, ఓపెన్ ఏఐ అందించిన ఏఐ ఏజెంట్స్ సేవలు సమర్థతను పెంచేలా ఉంటాయి.