గత కొద్దీ రోజులుగా గూగుల్ జెమిని ఫ్లాష్ ఇమేజ్ మోడల్ 2.5ను నానో బనానా (Gemini nano banana) ఏఐ మోడల్‌గా పిలుచుకుంటూ నెటిజన్లు తెగ వినియోగిస్తున్నారు. తమ ఫొటోలను మరింత ఆకర్షణీయంగా, అందంగా మార్చుకోవడానికి ఈ మోడల్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జిబ్లీ స్టైల్ నుంచి 3D మోడల్స్ వరకు విభిన్న రకాల ఫోటోలు సృష్టించుకునే అవకాశం ఉండడంతో యువతలో ఈ ఫీచర్ విపరీతమైన ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం భారత్‌తో పాటు విదేశాల్లోనూ నానో బనానా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్‌లో నానో బనానా ఫీచర్
AI స్టార్టప్ పర్‌ప్లెక్సిటీ, గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇంజిన్‌ను తమ బాట్‌లో జతచేసి వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల ప్రత్యేకంగా జెమిని యాప్ లేదా గూగుల్ AI స్టూడియో అవసరం లేకుండానే డైరెక్ట్‌గా వాట్సాప్‌లోనే ఈ సర్వీస్‌ను వాడుకోవచ్చు. వినియోగదారులు Perplexity AI bot నంబర్ +1 (833) 436-3285ను సేవ్ చేసుకుని చాట్ ప్రారంభిస్తే సరిపోతుంది. ప్రాంప్ట్ ఇచ్చి కొత్త ఫోటోలు సృష్టించుకోవచ్చు లేదా మన ఫోటోలను నానో బనానా ఇమేజ్‌గా మార్చుకోవచ్చు.
ప్రస్తుతం ఈ సర్వీస్ ఉచితమా లేక సబ్స్క్రిప్షన్ ఆధారమా అన్న విషయాన్ని Perplexity స్పష్టంగా చెప్పలేదు. అయితే గూగుల్ పరిమిత ఉచిత సర్వీస్ అందిస్తుండగా, పేమెంట్ చేసిన సబ్‌స్క్రైబర్లకు అధిక ఫీచర్లు లభించే అవకాశం ఉంది. భారత్‌లో ఇప్పటికే నానో బనానా ఏఐ ఫోటోలు విస్తృతంగా ఉపయోగిస్తున్నందున, వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో వినియోగం మరింత పెరుగుతుందని అంచనా. యాప్ స్టోర్, గూగుల్ ప్లేలో జెమిని యాప్ టాప్‌లో ఉండటం కూడా ఈ ట్రెండ్‌ను బలంగా చూపిస్తోంది.