డిజిటల్ చెల్లింపులు మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. PhonePe, Google Pay, Paytm వంటి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్‌లు లావాదేవీలను సులభతరం చేశాయి. అయితే రేపటి అంటే ఆగస్టు 1వ తేదీ, 2025 నుంచి ఈ UPI లావాదేవీలకు సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ మార్పుల గురించి యూజర్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ముఖ్యమైన కొత్త నియమాలు
కొత్త నిబంధనల ప్రకారం.. యూజర్లు ఒక రోజులో 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోగలరు. ప్రతీ లావాదేవీ పూర్తయిన తర్వాత బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి. ఆటో పే (AutoPay) లావాదేవీలు ఉదయం 10 గంటలలోపు లేదా రాత్రి 9:30 గంటల తర్వాత మాత్రమే జరుగుతాయి. ఇది నిర్దిష్ట సమయాల్లో జరిగే ఆటోమేటిక్ చెల్లింపులపై నియంత్రణను సూచిస్తుంది. అలాగే, యూజర్లు రోజుకు 25 సార్లు మాత్రమే తమ బ్యాంక్ ఖాతాలను చూడటానికి అనుమతించబడతారు. పెండింగ్‌లో ఉన్న లావాదేవీల (Pending Transactions) స్టేటస్‌ను రోజుకు మూడు సార్లు మాత్రమే తనిఖీ చేసుకునే అవకాశం ఉంటుంది.
యూజర్లపై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ కొత్త నిబంధనలు యూజర్ల డిజిటల్ లావాదేవీల అలవాట్లపై కొంత ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా బ్యాలెన్స్ తనిఖీలు, బ్యాంక్ ఖాతా వీక్షణలపై పరిమితులు ఉండటం వల్ల, తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసుకునే వారికి ఇది కొత్తగా అనిపించవచ్చు. అనవసరమైన తనిఖీలను తగ్గించి, లావాదేవీలను మరింత క్రమబద్ధీకరించడం ఈ నియమాల ఉద్దేశ్యం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. యూజర్లు ఈ కొత్త నిబంధనలను గుర్తుంచుకొని, తమ డిజిటల్ చెల్లింపులను ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం. ఏదైనా అదనపు సమాచారం కోసం లేదా సందేహాల నివృత్తి కోసం సంబంధిత యాప్స్ నోటిఫికేషన్లు లేదా కస్టమర్ సపోర్టును సంప్రదించడం మంచిది.
Read Also : Revanth Reddy : విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష