ఏపీలో భారీ పెట్టుబడులకు టాటా పవర్ ఆసక్తి టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం అందించేందుకు, కొత్త అవకాశాలను అన్వేషించేందుకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ రోజు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.49,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడిన విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడే ఈ ఒప్పందం చాలా కీలకం.

టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్
టాటా పవర్ వంటి అగ్రగామి సంస్థల భాగస్వామ్యం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది” అని అన్నారు.టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ నందా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం మా సంస్థకు గౌరవంగా భావిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందడుగులు అభినందనీయమైనవి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సీఎఫ్ఓ అమిత్ మిమానీ, గ్రూప్ హెడ్ (ప్లానింగ్ రెన్యూవబుల్స్) తాహేర్ లోకానంద్ వాలా, లీడ్ (స్ట్రాటజీ) గరిమా చౌదరి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్, NREDCAP ఎండీ కమలాకర్ బాబు, జనరల్ మేనేజర్ (విండ్ & సోలార్) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. సౌర మరియు విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాష్ట్రంలో పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి మరింత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.