Tahawwur Rana : 2008 ముంబై ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ రాణా అమెరికా నుంచి భారత్ కు చేరుకున్నాడు. భారత నిఘా, దర్యాప్తు అధికారుల సంయుక్త బృందంతో పాటు ప్రత్యేక విమానంలో రాణాను తీసుకుని వచ్చారు. దేశ రాజధానిలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ముంబై 26/11 దాడులలో రాణా పాత్రపై NIA విచారణ జరపనుంది.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను
దాడులు జరిగిన 15 సంవత్సరాల తర్వాత న్యాయం కోసం భారతదేశం చేసిన ప్రయత్నాలలో రాణాను అప్పగించడం ఒక ముఖ్యమైన దౌత్య, చట్టపరమైన పురోగతిని సూచిస్తుంది. తహవూర్ రాణాపై ఎన్ఐఏ నమోదు చేసిన కేసును వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టులు, అప్పిలేట్ కోర్టుల్లో ఆయన వాదనలు వినిపించనున్నారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సాయుధ కమాండోలు
మరోవైపు తహవూర్ రాణా రాక నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సాయుధ కమాండోలు మోహరించారు. తహవూర్ రాణాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. అక్కడ అధిక భద్రత మధ్య ఆయన్ని విచారించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాణాను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: రాణా కేసు.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్